రైతు, సైనికులకు ఘన సన్మానం

రైతు–సైనికుల సేవలు అభినందనీయం

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ: రైతు, సైనికుల సేవలు దేశానికి అమూల్యమైనవని స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య అన్నారు. దేశానికి వెన్నెముక రైతు అయితే, దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టేది సైనికుడని కొనియాడారు.

జిల్లా కేంద్రంలోని మారుతినగర్‌లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్‌స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల, టీఎంఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “సైనికులకు వందనం – రైతులకు నీరాజనం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశభక్తి చైతన్య కార్యక్రమాలతో పాటు మానసిక దివ్యాంగ విద్యార్థులకు యోగా, డ్రాయింగ్, పెయింటింగ్, పాటల పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీఎంఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాటి వీరేశం మనవడు తాటి స్తోత్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్నేహ సొసైటీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

అనంతరం మాజీ సైనికులు బాదావత్ రాజేందర్, రేకాజీ రాజేశ్వర్, రైతులు అబ్బగోని గంగాధర్ గౌడ్, వరికూటి మాల కొండారెడ్డి, ఒంటిపల్లి శ్యామ్ కుమార్‌లను ఘనంగా సన్మానించారు.

అతిథులు మాట్లాడుతూ, రైతులు, సైనికులను ఒకే వేదికపై సన్మానించడం అభినందనీయమని అన్నారు. రైతు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కాగా, సైనికుడు దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రజల భద్రతకు అంకితమవుతున్నాడని పేర్కొన్నారు.

దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధి కోసం స్నేహ సొసైటీ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని వక్తలు కొనియాడారు. ఇప్పటివరకు అనేక మంది దివ్యాంగ విద్యార్థులను ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో కూడా తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, జిల్లా విశ్రాంత సైనికుల సంఘం అధ్యక్షుడు సుర హర ప్రసాద్, శ్రీ నూతన వైశ్య పాఠశాల అధ్యక్షుడు ఇంగు శివప్రసాద్, కార్యదర్శి కొండ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.