దేశ ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్న వ్యక్తి మోడీ

దేశ ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్న వ్యక్తి మోడీ

  • మంత్రి వై. సత్యకుమార్ యాదవ్

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ:
దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండల కేంద్రంలోని మునేరు అవతల గల మామిడి తోటలో నిర్వహించిన ‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్’ ఎన్టీఆర్ జిల్లా రెండు రోజుల శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

వరుస అపజయాలను జీర్ణించుకోలేక కాంగ్రెస్‌తో పాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్కామ్‌లతో నిండిపోయి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి ఏమాత్రం అవగాహన లేదని, అవగాహన లేకుండానే ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. వీటన్నింటికీ భిన్నంగా ప్రధాని మోడీ దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తూ, భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు దేశాభివృద్ధితో ముందుకు తీసుకువెళ్తున్నారని స్పష్టం చేశారు.

మంత్రికి వినతి పత్రం సమర్పణ:
అనంతరం పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నలమోలు రామప్రసాద్‌లు మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. మండల కేంద్రంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, మునేరు అవతల మూడు రోడ్లు కలిసే కూడలి వద్ద రింగ్ రోడ్డు (జంక్షన్) ఏర్పాటు చేయడంతో పాటు, రెండు వైపులా డబుల్ రోడ్డు నిర్మించాలని వారు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అబ్బూరి శ్రీరామ్, దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ కమిటీ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు మన్నె శ్రీనివాసరావు, అన్నెపాక ప్రఫుల్ల శ్రీకాంత్, కల్లూరి శ్రీవాణిలతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply