ఉపేంద్ర హై స్కూల్‌లో ఎన్‌సీసీ ఫైర్ రేంజ్ ప్రారంభం

ఉపేంద్ర హై స్కూల్‌లో ఎన్‌సీసీ ఫైర్ రేంజ్ ప్రారంభం
విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపే లక్ష్యం
విజయవాడ, ఆంధ్రప్రభ : 17(ఏ) ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీ, కాకినాడ పరిధిలోని 9 జిల్లాల ఎన్‌సీసీ విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించేందుకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీలోని డోకిపర్తి ఉపేంద్ర హై స్కూల్‌లో ఫైర్ రేంజ్‌ను ఏర్పాటు చేసినట్లు స్కూల్ ఇన్ఛార్జి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తూనుకుంట్ల శ్రీనివాసు తెలిపారు.
బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు పెంపొందించేందుకు ఎన్‌సీసీ ఉత్తమ వేదికగా నిలుస్తుందని చెప్పారు. దేశ సేవకు ఆర్మీ, అగ్నివీర్ వంటి రంగాల్లో చేరేందుకు ఎన్‌సీసీ ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ట్రైనింగ్ జెసిఓ (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) సుబేదార్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వార్షిక శిక్షణలో భాగంగా క్యాడెట్లకు ప్రతిరోజూ శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అబ్స్టాకిల్ ట్రైనింగ్, ఫైరింగ్ ప్రాక్టీస్, టెంట్ పిచింగ్, యోగా, ఫిజికల్ ట్రైనింగ్, డ్రిల్, వెపన్ ట్రైనింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల్లో సమగ్ర శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
బెటాలియన్ పరిధిలో 537 మంది క్యాడెట్లు శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. హిందూ హై స్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి. నారాయణరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలపై నిపుణులతో ప్రత్యేక ఉపన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
స్కూల్ ప్రిన్సిపాల్ పి. శ్యామల మాట్లాడుతూ వార్షిక శిక్షణ శిబిరం ద్వారా క్యాడెట్లలో దేశభక్తి, నాయకత్వం, సేవాభావం, క్రమశిక్షణ, జట్టు భావన పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అజిత్ సింగ్ తోమర్, సుబేదార్ మేజర్ అనిల్ కుమార్ దహియా, క్యాంప్ అడ్జుటెంట్ కెప్టెన్ కె.పి.టి. విజయ భాస్కర్ తదితరులు కార్యక్రమాలను సమన్వయపరుస్తున్నారు.
