రైతన్నకు కాస్త ఊరట…
- ఎగువన కుంభవృష్టి.. కృష్ణా జిల్లా రైతులకు పెద్ద ఉపశమనం!
- మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాలు.
- కృష్ణా జిల్లాలో చిగురిస్తున్న ఖరీఫ్ ఆశలు.
- ఎగువన వర్షాల జోరు.. ప్రకాశం బ్యారేజీ వైపు వరద పోటు..
- డెల్టా రైతుల్లో చిగురిస్తున్న ఆనందం!
- కృష్ణా జిల్లాలో ఊపందుకోనున్న వరి నాట్లు..
ఆంధ్రప్రభ – కృష్ణా బ్యూరో : ఉమ్మడి కృష్ణా జిల్లా రైతాంగానికి ఎట్టకేలకు ఒక శుభవార్త అందింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది నుంచి ఏపీకి మరో మూడు రోజుల్లో క్రమంగా వరద నీరు భారీగా వచ్చి చేరనుంది. ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం ప్రాజెక్టుల మీదుగా నీరు దిగువకు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ పరిధిలోని డెల్టా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఎల్ నినో ప్రభావంతో సాగు నీరు అందక, కాలువలు ఎండిపోయి ఖరీఫ్ సీజన్ సాగుపై తీవ్ర ఆందోళనలో ఉన్న అన్నదాతలకు ఈ వరద ప్రవాహం ఒక పెద్ద ఊరటనిస్తోంది. ఇటు ఎగువ కృష్ణా నీరు, అటు పట్టిసీమ ద్వారా వస్తున్న గోదావరి జలాలు తోడవడంతో డెల్టా కాలువలు కళకళలాడనున్నాయి. దీంతో రైతులు సాగు పనులను వేగవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వరద నీరు కృష్ణా డెల్టా రైతుల పాలిట వరంగా మారనుది. క్షేత్రస్థాయిలో సాగు పనుల ఊపు అందుకోనుంది.

ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న కుంభవృష్టి వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఏపీకి క్రమంగా వరద నీరు పోటెత్తుతోంది.రెండు ప్రధాన నదుల్లోనూ నీటిమట్టాలు వేగంగా పెరుగుతుండటంతో అటు గోదావరి, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతాలు అలర్ట్ అయ్యాయి. మహారాష్ట్రలోని క్యాచ్‌మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలోకి, కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి కృష్ణా నదిలోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఏపీలోని ప్రధాన జలాశయాల వైపు వరద నీరు పోటెత్తుతోంది. అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

జూలై నెల ముగిసి ఆగష్టు ప్రారంభం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం, సాగునీటి కొరత కారణంగా జిల్లాలో వరి నాట్లు తీవ్రంగా ఆలస్యమయ్యాయి. ఇప్పుడు ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, జూరాల నుంచి వరద నీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ పరిధిలోని డెల్టా కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసే అవకాశం లభిస్తుంది. దీనివల్ల దాదాపు 4 లక్షల ఎకరాల వరి సాగుకు అవసరమైన నీరు సకాలంలో అందుతుంది.

ఆల్మట్టి, నారాయణపూర్ గేట్లు ఎత్తివేత…
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో అధికారులు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం, సాగర్ వైపు వరద…
తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు 1.04 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తాన్ని కిందకు వదులుతున్నారు. దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 1.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
….వారంలోగా ప్రకాశం బ్యారేజీకి ప్రవాహం…
ఎగువన మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వంటి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో, రాబోయే 48 గంటల్లో ఆల్మట్టికి మరో 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నీరంతా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల దాటుకుంటూ రాబోయే వారం రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున పోటెత్తనుంది
కృష్ణా జిల్లాలో…
ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా దాదాపు 4.10 లక్షల ఎకరాల (1.65 లక్షల హెక్టార్లు) విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ప్రధాన పంటల సాగు విస్తీర్ణం జిల్లాలో వరి అత్యధికంగా దాదాపు 3.96లక్షల ఎకరాలలో (1,60,655 హెక్టార్లు) కేవలం వరి పంటనే సాగు చేస్తారు. ఇక్కడి డెల్టా భూములు వరి సాగుకు ఎంతో అనుకూలమైనవి. పత్తి మెట్ట ప్రాంతాలలో దాదాపు 1.18 లక్షల ఎకరాల (48,000 హెక్టార్లు) విస్తీర్ణంలో పత్తి పంటను సాగు చేస్తారు. మిగిలిన ఇతర పంటల విస్తీర్ణంలో మొక్కజొన్న, చెరకు, మిరప, మినుములు పెసలు వంటి ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయా పంటలకు సవాల్ గా నిలిచిన సాగునీరు అందేలా వరద నీరు కొంత ఉపశవనం కానుంది.
