కాలువలు పొంగి రోడ్డెక్కిన మురుగు..
ఏలూరులో అంటువ్యాధుల ముప్పు!
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
తక్షణమే కాలువల శుభ్రత చేపట్టాలని విజ్ఞప్తి
ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు నగరంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలువలు మురుగుతో నిండిపోయి రోడ్లపైకి పొంగిపొర్లుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆర్ఆర్ క్లాత్ షాప్ సమీపంలో కాలువ పూర్తిగా నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరి, అక్కడ సంచరించే ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్య ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొంతకాలంగా కాలువల నిర్వహణ, శుభ్రత పనులను మున్సిపల్ అధికారులు సక్రమంగా చేపట్టకపోవడంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమలు విపరీతంగా పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువల పూడిక తొలగింపు, మురుగునీటి పారుదల వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలని, నగరంలో పారిశుధ్య చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఏలూరు ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
