“సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమానికి ఘన శ్రీకారం

“సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమానికి ఘన శ్రీకారం

జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆధ్వర్యంలో వినూత్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం ప్రారంభం

చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ శనివారం ఘనంగా ప్రారంభించారు. చిత్తూరు పట్టణంలోని సంతపేట ఆర్.ఆర్. గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్, ఐఏఎస్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నాన్ కేడర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర రాజు, చుడా చైర్మన్ కటారి హేమలత, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో సబ్ డివిజన్ డీఎస్పీ జె. వెంకటనారాయణ “సురక్షిత చిత్తూరు” లోగోను ఆవిష్కరించి కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను వివరించారు. అనంతరం మహిళలు, చిన్నారులపై నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు భద్రత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

నేరాలు జరగక ముందే నివారణే లక్ష్యం : ఎస్పీ తుషార్ డూడి

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ప్రజల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడూ భాగస్వామిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, నేరాలు జరగకుండా ముందుగానే అవగాహన కల్పించడం మరింత ప్రభావవంతమైన విధానమని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. “సురక్షిత చిత్తూరు” కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి విద్యాసంస్థ, ప్రతి కాలనీ, ప్రతి కుటుంబానికి భద్రతా సందేశాన్ని చేరవేయడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు పోలీసులకు భాగస్వాములుగా మారినప్పుడే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

అవగాహనతోనే సవాళ్లను అధిగమించవచ్చు : జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సామాజిక, సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడంలో అవగాహన కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. మహిళల రక్షణ, చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ భద్రత, రోడ్డు భద్రత వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచే ఈ కార్యక్రమం జిల్లాకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం : ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అభినందనీయమన్నారు. నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు యువతను సరైన మార్గంలో నడిపించే సామర్థ్యం ఈ కార్యక్రమానికి ఉందన్నారు. “సురక్షిత చిత్తూరు” లక్ష్యాలను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి సహకరించాలని పిలుపునిచ్చారు.

ఆలోచింపజేసిన సాంస్కృతిక ప్రదర్శనలు

కార్యక్రమంలో భాగంగా నాయుడుపేటకు చెందిన నటరాజ కళాక్షేత్ర బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, చిన్నారులపై నేరాలు, ప్రేమ పేరుతో మోసాలు, ఎలోప్మెంట్లు, మాదకద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే దుష్పరిణామాలపై సందేశాత్మక నాటికలను ప్రదర్శించి సమాజానికి విలువైన సందేశాలు అందించారు. సామాజిక చైతన్యానికి తోడ్పడిన కళాకారులను జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తదితర అతిథులు ఘనంగా సన్మానించి అభినందించారు.

జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

“సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమం ద్వారా మహిళల రక్షణ, చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత వంటి అంశాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎం. దేవదాస్, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత మరియు ప్రజలు పాల్గొన్నారు.