WTCలో నంబర్-1 సెంచరీ హీరో…

WTCలో నంబర్-1 సెంచరీ హీరో…

భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. న్యూచండీగఢ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగి ఆఫ్ఘన్ బౌలర్లను కట్టడి చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 368/3తో భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది.

మొదట కేఎల్ రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టుకు బలమైన పునాది వేశాడు. 165 బంతుల్లో 100 పరుగులు చేసిన రాహుల్.. టెస్టు క్రికెట్‌కు తగ్గట్టుగా ఓర్పుతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ సెంచరీ అతడి అంతర్జాతీయ కెరీర్‌లో 22వ శతకం కావడం విశేషం. క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలుస్తూ మరోసారి తన అనుభవాన్ని చాటుకున్నాడు.

మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. 143 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేసిన గిల్.. టెస్టు క్రికెట్‌లో 11వ సెంచరీ నమోదు చేశాడు. ఈ శతకంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అదే స్థిరత్వంతో పరుగులు చేస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.

ఒకవైపు రాహుల్ తన అనుభవాన్ని చూపిస్తే.. మరోవైపు గిల్ భవిష్యత్ నాయకుడిగా తన ముద్ర వేస్తున్నాడు. ఈ ఇద్దరి సెంచరీలతో పాటు సాయి సుదర్శన్ 81 పరుగులతో రాణించడంతో తొలి రోజే మ్యాచ్‌పై భారత్ గట్టి పట్టు సాధించింది.