ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

మోపిదేవి, ఆంధ్రప్రభ ; మోపిదేవిలో మంగళవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. జలధార పనుల్లో అధికారుల నిర్లక్ష్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపాదనలు ఆలస్యమైతే నిధుల సాధన ఎలా సాధ్యమని ప్రశ్నించారు.గ్రామ అభివృద్ధి ప్రణాళిక ఖచ్చితంగా రూపొందించాలని, గ్రామ ప్రత్యేక అధికారులు కీలకంగా పని చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామ కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.
ప్రత్యేక అధికారులు కొరడా ఝళిపించి కార్యదర్శులతో పని చేయించాలన్నారు. పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలధార పనుల ఎంపిక, తీర్మానాలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ, బాధ్యతగా పని చేయకపోతే సస్పెండ్ చేయిస్తానని నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పరిష్కారాలు సూచించారు.
