విద్యా సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాట కార్యక్రమాలు చేపట్టనున్నట్లు యూఎస్పీసీ (ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ) నాయకులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం జేబులకు నల్ల బ్యాడ్జీలు ధరించి పాఠశాలల్లో నిరసన తెలిపారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన నాయకులు, ప్రాథమిక పాఠశాలల బలోపేతం, జీఓ-25 సవరణ, ప్రతి పాఠశాలకు తగిన సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకం, బదిలీలు, పదోన్నతులు, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, డీఏ బకాయిల చెల్లింపు తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసనలు, మెమోరాండాలు, 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముడుగు సామ్యూల్, జిల్లా ఉపాధ్యక్షుడు బానోత్ ప్రకాశ్, జిల్లా కౌన్సిలర్ సి. వీరయ్య, ఎం. చంద్రబాన్, మండల అధ్యక్షుడు కుమ్ర శ్రీను, ఉట్నూర్ మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
