గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు..

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు..

  • రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; విద్యార్థులకు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యార్థుల సమ్మర్ సమ్మర్ క్లాసులను కొనకళ్ళ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధి కొనకళ్ళ మాట్లాడుతూ ఎవరైతే ఎక్కువ సమయం లైబ్రరీలో సమయం కేటాయించి విజ్ఞానం నేర్చుకుంటారో వారే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని ఆయన తెలియజేశారు.

కేవలం 10వ తరగతి వరకే చదువుకున్న తాను మచిలీపట్నం గ్రంధాలయంలో చదివిన పుస్తకాలు వలన వచ్చిన విజ్ఞానంతో భారతదేశంలోని అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్ పదవి లో కూర్చుని పరిపాలించడం జరిగిందని అందుకు గ్రంథాలయాలకు తను రుణపడి ఉన్నానని అన్నారు. కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ నేడు కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా అన్ని లైబ్రరీలను నేటి కాలానుగుణంగా అభివృద్ధి పరుస్తున్నారని తెలియజేశారు. కృష్ణా యూనివర్సిటీ రిజిస్టర్ ఉషా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులే గురువులని మధ్యప్రదేశ్ లో పుట్టిన తను ఈనాడు పేపర్ చదువుకొని లైబ్రరీ కి వెళ్లడం ద్వారా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతున్నానని తెలియజేశారు.

సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ.. మంచి సమాజం కోసం పిల్లలను చిన్నతనం నుండి నైతిక విలువలతో పెంచవలసిన బాధ్యత ఉందని అన్నారు. పిల్లలను టీవీలకు సెల్ ఫోన్ లకు దూరంగా ఉంచాలని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలను ప్రోత్సహించవద్దని తెలియజేశారు. జిల్లా గ్రంథాలయం ఏర్పాటుచేసిన 40 రోజులు శిక్షణ తరగతుల్లో అనేకమంది నిష్ణాతులను ఏర్పాటు చేసినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వేములపల్లి రవికుమార్ అన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ సహాయ లైబ్రరీయన్ బీరం వెంకట రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ అధ్యాపకులుదిట్టకవి వెంకటేశ్వరరావు, సవరం వెంకటేశ్వరరావు, ముదిగొండ శాస్త్రి ప్రముఖ కవియత్రి గుడిపూడి రాధికా రాణి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణి కుమార్, మచిలీపట్నం 17వ డివిజన్ కార్పొరేటర్ మరకాని సమతా కీర్తి ప్రముఖ కవులు మేడికొండ యోగేశ్వరరావు పోతురాజు మాస్టారు కారుమురి రాజేంద్ర ప్రసాద్ ఇంటి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో నగరానికి చెందిన పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జిల్లా గ్రంధాలయం ప్రాంగణంలో ఉచిత శిక్షణా తరగతులు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు.

Leave a Reply