ఆంధ్రప్రభ వెబ్ వార్తకు స్పందన
హైవేపై ఏర్పడిన గుంతను పూడ్చిన పీసీఆర్ ఫౌండేషన్
జన్నారం, ఆంధ్రప్రభ : ప్రమాదాలకు నిలయంగా మారిన ధర్మారం చౌరస్తా.. హైవేపై గుంతను పూడ్చాలని కోరుతూ ‘పూడ్చండి సారూ’ అనే శీర్షికతో ఆంధ్రప్రభ వెబ్‌లో ఈ నెల 1న ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది.
జన్నారం మండల కేంద్రంలోని ధర్మారం చౌరస్తా అంగడి బజార్ వద్ద రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గుంతను మండల పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం స్వచ్ఛందంగా పూడ్చారు.
మంచిర్యాల–ఆదిలాబాద్, నిర్మల్ రాష్ట్ర రహదారిపై ఏర్పడిన భారీ గుంతతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఫొటోలతో సహా ఆంధ్రప్రభ వెబ్‌లో ప్రచురించారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్పందించకపోవడంతో పీసీఆర్ ఫౌండేషన్ సభ్యులు ముందుకు వచ్చి గుంతను పూడ్చారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ గుంతను పూడ్చేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో తామే స్వచ్ఛందంగా పూడ్చినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఫౌండేషన్ ఎల్లవేళలా ముందుంటుందని పేర్కొన్నారు.
సమస్యను వెలుగులోకి తెచ్చిన ఆంధ్రప్రభ వెబ్‌కు, పీసీఆర్ ఫౌండేషన్ సభ్యులకు వాహనదారులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీసీఆర్ ఫౌండేషన్ సభ్యులు మున్వర్ అలీఖాన్, కొత్త శ్రీనివాస్ గుప్తా, కొమురవెల్లి లచ్చన్న, నల్లతీగల విష్ణు, రవి తదితరులు పాల్గొన్నారు.
