మంత్రి అనుచరుడిపై రూ.80 లక్షల బకాయి ఆరోపణలు
దుర్గమ్మ ఆలయానికి గిరిజనుల నిరసన పాదయాత్ర
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు రాజా తమతో పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపిస్తూ జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామ బంజారా గిరిజనులు శుక్రవారం ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ కనకదుర్గ గుడికి పాదయాత్ర చేపట్టారు. మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని తమకు న్యాయం జరిగేలా చూడాలని నినాదాలు చేశారు. పాదయాత్రలో దుర్గమ్మ ఫొటో, సారె ప్రదర్శించారు.
సంప్రదాయ లంబాడీ దుస్తుల్లో ప్ల కార్డులు చేతపట్టి మంత్రి కొల్లు అనుచరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి అనుచరుడు రాజా తమతో కాంట్రాక్టు పనులు చేయించుకుని సుమారు రూ.80 లక్షలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. డబ్బులు చెల్లించమని అడిగితే తాను మంత్రి కొల్లు అనుచరుడినని, డబ్బులు ఇవ్వను.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల పాదయాత్రకు సీపీఎం మండల కార్యదర్శి ఎం.మహేష్ సంఘీభావం తెలిపారు. ఈ నిరసన పాదయాత్ర వల్ల ఇబ్రహీంపట్నం నుంచి తుమ్మలపాలెం వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇబ్రహీంపట్నం సీఐ ఎ.సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ ఆర్ఐ కృష్ణ, ఎస్సైలు రాజు, సత్యవతి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.

