పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషి
విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం
ఊట్కూర్, ఆంధ్రప్రభ: పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాల సమగ్ర అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తూ, విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్ అన్నారు.
శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఉచితంగా షూలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యా సామగ్రి అందించడం అందరి బాధ్యత అన్నారు.
విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు మంచి ప్రతిభ కనబరచాలని కోరారు.
పాఠశాల అభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం బాలికల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నందున, ఈ అవకాశాలను అందిపుచ్చుకుని బాలికలు చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ మాధవి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
