రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
పెడన, ఆంధ్రప్రభ: పెడన మండలం ముచ్చిలిగుంట గ్రామంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, ప్రభుత్వ రాజముద్రతో అందిస్తున్న నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు మరింత భరోసా కల్పిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడంలో ఈ పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. భూ యజమానుల ఫొటోలతో, ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులు ఆనందంగా స్వీకరిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
