దస్తురాబాద్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన

దస్తురాబాద్, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వేడుకలను నిర్వహించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వాతావరణం పాఠశాలలో ముందుగానే నెలకొంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోటా వేణు ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు.

చిన్నారులు వివిధ పౌరాణిక, జానపద వేషధారణలతో అలరించారు. అమ్మవారి రూపంలో ఓ విద్యార్థిని త్రిశూలం పట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరికొందరు విద్యార్థులు పోతురాజుల వేషధారణలో చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

విద్యార్థుల్లో చిన్నతనం నుంచే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంతో పాటు చదువుతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు కోటా వేణు తెలిపారు.

పాఠశాల ఆవరణంతా పండుగ శోభతో కళకళలాడటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.