డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి

  • మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి: బుట్టా రేణుక, డాక్టర్ ఆదిమూలపు సతీష్
  • కోడుమూరులో వైఎస్సార్‌సీపీ డీఎస్సీ రిలే దీక్షలు రెండో రోజుకు చేరిక

కోడుమూరు, ఆంధ్రప్రభ: డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోడుమూరులో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచనలు, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి.

జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ఎంకే వెంకటేష్, కోడుమూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు సాయి ముఖేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో రోజు దీక్షలకు కర్నూలు పార్లమెంటు ఇన్‌చార్జి బుట్టా రేణుక, కోడుమూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్వతంత్ర సీబీఐ విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంలో రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.

అలాగే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రఘునాథ్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు ప్రజ్వల్, జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, గూడూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జే. వెంకటేశ్వర్లు, గూడూరు టౌన్ అధ్యక్షుడు ఆబెల్, గూడూరు మండల కన్వీనర్ రామాంజనేయులు, రవికుమార్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, తేనేశ్వర్ రెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి కృష్ణారెడ్డి, రమణారెడ్డి, ప్రసాదు, మాధవస్వామి, రామచంద్రుడు, బడే సాహెబ్, దివాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లింగన్న, కోడుమూరు మండల రైతు విభాగం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, దౌలత్ భాష, గూడూరు పట్టణ సచివాలయం వన్ అధ్యక్షుడు రవి ప్రతాప్, గంగాధర్, బీసీ సెల్ అధ్యక్షుడు మద్దిలేటి, సోషల్ మీడియా అధ్యక్షుడు అంజి, మధు, రవి, మాజీ సర్పంచ్ గోపాల్, ఎంపీటీసీలు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.