Missing | చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ముమ్మర గాలింపు
Missing | చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ముమ్మర గాలింపు
Missing | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా తుని పరిసర ప్రాంతంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరమయ్యాయి. చిన్నారి కోసం జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా శోధిస్తున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్), అటవీశాఖ అధికారులతో కలిసి అటవీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అధునాతన డ్రోన్ల సాయంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ చిన్నారి ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుండగా, గాలింపు చర్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోగా, తాజాగా హోంమంత్రి వంగలపూడి అనిత కూడా జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి గాలింపు చర్యల పురోగతిని సమీక్షించారు.
ఇదిలా ఉండగా, కేసు దర్యాప్తులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క ఇటీవల మృతి చెందింది. ఆ కుక్క మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
