ఎస్ఆర్ఎస్పీ, కడెం ప్రాజెక్టులను సందర్శించిన మంత్రుల బృందం
ప్రాజెక్టుల నీటి నిల్వలపై అధికారులతో సమీక్ష
నిర్మల్, ఆంధ్రప్రభ: ఎస్ఆర్ఎస్పీ, కడెం ప్రాజెక్టుల సందర్శన కోసం శనివారం నిర్మల్ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద పూల మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రులు రోడ్డు మార్గంలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టులోని నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికార ప్రతినిధి సుదర్శన్ రెడ్డి కూడా వారితో ఉన్నారు.
తదనంతరం మంత్రుల బృందం కడెం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, అదనపు ఎస్పీ సాయి కిరణ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
