‘అమ్మ మాట – అంగన్వాడి బాట’కు మంత్రుల ప్రాధాన్యం

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని అంగన్వాడి కేంద్రం-4లో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వహించిన ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

వేసవి సెలవుల అనంతరం అంగన్వాడి కేంద్రాలు పునఃప్రారంభమైన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, చిన్నారులను సంపూర్ణ నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అధిక మొత్తంలో ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలలకు పంపించే బదులు ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.

ప్రస్తుతం అంగన్వాడి కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే అన్ని కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేస్తూ పిల్లలకు ‘అమ్మ ముద్ద’ పేరుతో అల్పాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయడంతో పాటు ఉపాధ్యాయులతో సమావేశమై వేతనాల పెంపుపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలకు పిల్లలే నిజమైన ఆస్తి అని అన్నారు. చిన్ననాటి నుంచే పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించి మంచి అలవాట్లు నేర్పించాలని సూచించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

జిల్లాలోని రెండు నియోజకవర్గాల గిరిజన కుటుంబాలకు చెందిన సుమారు వెయ్యి మందికి హైదరాబాద్ సందర్శన అవకాశం కల్పిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. హైదరాబాద్‌ను ఎన్నడూ చూడని గిరిజనులకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేసి ఆశీర్వదించారు.

కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ శ్రీ హరిత అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు, అంగన్వాడి టీచర్లతో మాట్లాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్వేత శుక్ల, గోలేటి సర్పంచ్ అజ్మీరా బాబురావు, జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జి శ్యాం నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కాంబ్లే అనిల్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగ, తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి, అంగన్వాడి టీచర్లు, అధికారులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply