అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదు కావాలి

  • మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్‌రావు

జైనూర్, ఆంధ్రప్రభ : మండలంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావు కోరారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గణేష్‌నగర్, మొమిన్‌పూర్ ప్రాంతాల్లోని 72, 73 పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ సర్వేలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా విశ్వనాథ్‌రావు మాట్లాడుతూ.. అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సర్వే నిర్వహిస్తున్న బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. ముకిద్, మాజీ ఎంపీటీసీ ఎస్.కే. రషీద్, కాంగ్రెస్ జిల్లా నాయకుడు పెందూర్ ప్రకాష్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అఫ్రోజ్, యువ నాయకులు అబ్బు, హైదర్, మైనార్టీ సెల్ నాయకుడు వసీం, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.