Accident | ఘోర ప్రమాదం.. ఎలా జరిగింది..?

Accident | ఘోర ప్రమాదం.. ఎలా జరిగింది..?

  • ట్రాలీ లారీ- ఎర్టిగా వాహనం ఢీ కొట్టుకోవడంతో దుర్ఘటన
    -ప్రమాద స్థలిలోనే నలుగురి దుర్మరణం
  • ప్రాణాపాయ స్థితిలో గ్రామ సర్పంచ్ గంగాధర్
  • నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు
  • హైదరాబాదు పరామర్శకు వెళ్లి తిరిగివస్తుండగా ఘటన

Accident | భైంసా, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సుద్దవాగు వంతెన పై సోమవారం అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మల్ నుంచి నాందేడ్ మార్గం వైపు వెలుతున్న పరిశ్రమల నిర్వాహణలో వినియోగించే భారీ పరికరాన్ని తీసుకెళుతున్న ట్రాలీ లారీ, నిజామాబాద్ వైపు నుంచి భైంసాలోనికి వస్తున్న ఎర్టిగా వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఎర్టిగా వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రమాద స్థలిలోనే దుర్మరణం పాలయ్యారు. మరొకరు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇద్దరు బాధితులు సిందే ఆనందవ్, లక్ష్మణు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కుభీర్ మండలంలోని కుప్టి సర్పంచ్ గంగాధర్ తో పాటు మరో ఐదుగురు గ్రామస్తులు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న గ్రామస్తుడిని పరామర్శించేందు వెళ్లారు. సోమవారం ఉదయం వెళ్లిన వీరందరూ రాత్రి పూట తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ఎర్టిగా వాహనం మరో రెండు నిముషాల వ్యవధిలో బైంసాకు చేరుకునే సమయంలో ప్రమాదాని గురైంది. సుద్దవాగు వంతెన పై ఎదురెదురుగా వస్తున్న ట్రాలీ, లారీ ఎర్టిగా వాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ట్రాలీ లారీ పై నున్న భారీ పరికరానికి తగిలిన ఎర్టిగా వాహనం కుడి వైపు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కుబీర్ మండల కేంద్రానికి చెందిన ఎర్టిగా వాహన డ్రైవర్ వికాస్ బొప్ప, మద్య సీట్ కుడి భాగంలో కూర్చున్న భోజరామ్ పాటిల్ వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు కొడిమెల పెద్ద రాజన్న, బోయిడి బాబన్నఘటన స్థలిలోనే దుర్మరణం పాలయ్యారు.

ఇక మధ్య సీట్ మధ్య భాగంలో కూర్చున్న గ్రామ సర్పంచ్ గంగాధర్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. క్షతగాత్రుడిని భైంసాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న బైంసా ఏఎస్సీ రాజేష్ మీనా, సీఐ సాయి కుమార్ లు ఘటన స్థలికి చేరుకొన్నారు. ఎర్టిగా వాహనంలో చిక్కుకొని మృతి చెందిన కొడిమెల పెద్ద రాజన్న, బోయిడి బాబన్నల మృతదేహాలను స్థానికుల సాయంతో బయటకు తీయించారు. అయితే.. తీవ్రమైన ప్రమాదం కారణంగా బోయిడి బాబన్న శరీరం నుంచి తల భాగం తెగిపోయి వాహనం నుంచి బయట పడిపోయింది. ఇక డ్రైవింగ్ సీట్ నుంచి కింది భాగంలో పడిపోయిన డ్రైవర్ వికాస్ బొప్ప, డోరు ఊడిపోయి రోడ్డుపై పడిపోయిన భోజరామ్ పాటిల్ మృతదేహాలను ట్రాలీ ఆటోలో పోస్టు మార్గం నిమిత్తం ఇక్కడి ఆసుపత్రికి తరలించారు. అనంతరం రోడ్డు పైనున్న రెండు వాహనాలను జేసీబీ ద్వారా తొలగించారు.

Leave a Reply