పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం
పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం
-మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వాదనలు పచ్చి అబద్ధాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కనీస పనులు చేపట్టకుండా, క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్రలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డిలతో కలిసి నార్లాపూర్ రిజర్వాయర్ పంప్ హౌస్, ప్యాకేజీ-3, ఏదుల పంప్ హౌస్ మరియు కుమ్మెర వద్ద జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పురోగతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
నిధుల మళ్లింపు-అసంపూర్తి పనులు:
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ. 80 వేల కోట్ల అంచనాలతో ప్రారంభించి, రూ. 35 వేల కోట్లు మంజూరు చేసినప్పటికీ, పదేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ. 27 వేల కోట్లు మాత్రమేనని మంత్రి వివరించారు. లక్ష కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను నిర్మించకుండానే అసంపూర్తిగా వదిలేశారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల సమయంలో ఆర్భాటంగా ఒక పంపును గంటపాటు నడిపించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వాస్తవానికి నార్లాపూర్ వద్ద బిగించాల్సిన తొమ్మిది మోటర్లలో కేవలం మూడింటిని మాత్రమే గత ప్రభుత్వం బిగించిందని, మరో ఐదు మోటర్లను తక్షణమే బిగించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వ లక్ష్యం:
ఈ ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నికర జలాలను వినియోగంలోకి తెచ్చి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలోని నాలుగు లక్షల అరవై వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. నార్లాపూర్ నుంచి ఉద్ధండాపూర్ వరకు పెండింగ్‌లో ఉన్న ప్రధాన కాలువల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని, మొత్తం 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించి, ప్రాజెక్టుల పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తారని ఆయన పేర్కొన్నారు.
కల్వకుర్తి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం:
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పట్ల కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి విమర్శించారు. ఈ ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం కేవలం 4 టీఎంసీలే ఉండటం వల్ల 40 వేల ఎకరాలకు మించి నీరందే అవకాశం లేదని, 4.50 లక్షల ఎకరాలకు నీరందాలంటే కనీసం 25 టీఎంసీల సామర్థ్యం అవసరమని ఆయన వివరించారు. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిలా సాగర్ వంటి ప్రాజెక్టులకూ సరైన నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడంతో జిల్లా రైతాంగం ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా అచ్చంపేట, వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టు వరకు నీరందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని జూపల్లి ప్రకటించారు. ఈ పర్యటనలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
