Meenakshi Natarajan Nomination Row | సీఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్‌

Meenakshi Natarajan Nomination Row | సీఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్‌

Meenakshi Natarajan Nomination Row | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సీనియర్‌ నేత మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్‌ అఫిడవిట్‌లో తెలంగాణకు సంబంధించిన కేసు వివరాలు వెల్లడించలేదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఆ అంశాన్ని పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ను తిరస్కరించింది.

ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేషన్‌ తిరస్కరణ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్య అని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేసింది. నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేసింది.

మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్‌ కేసు నమోదు కాలేదని, తెలంగాణకు సంబంధించిన అంశంలో కేవలం నోటీసు మాత్రమే వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. అందువల్ల దాన్ని అఫిడవిట్‌లో తప్పనిసరిగా పేర్కొనాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ అభిప్రాయపడుతోంది.

నామినేషన్‌ తిరస్కరణపై న్యాయపరంగా పోరాడేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్‌ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. తాజా పరిణామంతో మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.