ఘనంగా మేడే వేడుకలు నిర్వహించాలి..

ఘనంగా మేడే వేడుకలు నిర్వహించాలి..
- గ్రామాల్లో ఎర్రజెండా ఎగరేయాలి..
- సీఐటీయూ యూనియన్ పిలుపు..
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు, కార్యదర్శి చెన్నూరి రమేష్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో గ్రామ గ్రామాన, పల్లె పల్లెనా మేడే సందర్భంగా ఎర్రజెండాలు ఎగరేసి కార్మిక ఐక్యతను ప్రదర్శించాలని కోరారు. మేడే సందర్భంగా ప్రతి గ్రామం, మండలం, జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఆటలు, పాటలు, నృత్యాలు, కబడ్డీ, క్రికెట్ పోటీలు, ఉపన్యాసాలు, వ్యాసరచన, నాటికలు, ఏకపాత్రాభినయాలు వంటి కార్యక్రమాల ద్వారా కార్మికుల్లో చైతన్యం పెంచాలని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక సాంస్కృతిక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సదుపాయాలను అందరికీ కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వాటి ప్రైవేటీకరణ కార్మికులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో మరింత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.
