భక్తులకు మరిన్ని వసతులు కల్పించాలి..

భక్తులకు మరిన్ని వసతులు కల్పించాలి..
రాష్ట్ర ప్రభుత్వానికి సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ విజ్ఞప్తి..
భవానిపురం, ఆంధ్రప్రభ : దుర్గగుడి మాస్టర్ ప్లాన్ లో భక్తులకు మరిన్ని వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. దుర్గగుడి అభివృద్ధి విషయంలో ఇటీవల తాను ఇచ్చిన కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటే భక్తులకు మరిన్ని సదుపాయాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక యంత్రాల సాయంతో దుర్గ గుడి కొండపై ప్రాంతాన్ని సమతలంగా తొలగించినట్లయితే దేవాలయం అభివృద్ధికి ఎక్కువ స్థలం సమకూరుతుందని వివరించారు.
మాస్టర్ ప్లాన్ లో కేవలం కొండ దిగువ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, కొండపై ప్రాంతంలో పరిమితంగానే అభివృద్ధి పనులు చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానముగా దుర్గగుడి అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలా అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.తిరుమల తరహాలో దుర్గగుడిని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు అవసరమైన కాటేజీల నిర్మాణం, ఉద్యానవనాల పెంపకం వంటివన్నీ కొండపై ప్రాంతంలో ఏర్పాటు చేసేలా కొండను సమతలం చేయడం అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఇలా దుర్గగుడిని అభివృద్ధి చేస్తే భావి తరాలు కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకునేందుకు వీలుంటుందని వివరించారు. ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని ఆలయ ప్రాంగణంతో సమానంగా చదును చేస్తే అనేక కొత్త నిర్మాణాలు ఏర్పాటు చేయవచ్చని అన్నారు. భక్తుల వసతి, అన్నదాన సౌకర్యాలు మెరుగుపరచవచ్చని తెలిపారు.
