Rugby Premier League | ఈసారి భాగ్యనగరంలో రగ్బీ సందడి..

Rugby Premier League | ఈసారి భాగ్యనగరంలో రగ్బీ సందడి..

గచ్చిబౌలిలో ఆర్‌పీఎల్ సీజన్-2 నిర్వహణకు రంగం సిద్ధం
యువ క్రీడాకారులకు ప్రతిభ చాటుకునే అరుదైన అవకాశం

భారత్‌లో రగ్బీ విస్తరణకు లీగ్ పోటీలు కీలకం

Rugby Premier League | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఆదరణ పొందుతున్న రగ్బీ క్రీడకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్) సీజన్-2 పోటీలను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నట్లు భారత రగ్బీ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఇండియన్ రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ అధ్యక్షుడు, నటుడు, మాజీ రగ్బీ క్రీడాకారుడు రాహుల్ బోస్ ప్రకటించారు. ఆదివారంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన ఇంటరాక్టివ్ సంభాషణలో ఆయన ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి పోటీలు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.

Rugby Premier League

ఫ్రాంచైజీ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్న ఆర్‌పీఎల్‌లో దేశంలోని ప్రముఖ నగరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు పాల్గొంటున్నాయి. క్రికెట్, కబడ్డీ తరహాలో రగ్బీకి కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. పోటీల ద్వారా యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు మరింత పెరుగనున్నాయి. అలాగే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కూడా ఈ పోటీల్లో పాల్గొంటారు. తద్వారా స్థానిక ఆటగాళ్లు వారి వద్ద నుంచి ఆటలో మెళుకువలు నేర్చుకునే అవకాశం ఉంది.


Rugby Premier League

రగ్బీ క్రీడ గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తోందని రాహుల్ బోస్ పేర్కొన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలు ఈ క్రీడ ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలకు ఎదుగుతున్నారని తెలిపారు. క్రీడా ప్రతిభతో పాటు ఉపాధి, వ్యక్తిత్వ వికాసానికి కూడా రగ్బీ దోహదపడుతోందన్నారు.

భారత్‌లో ఇప్పుడిప్పుడే రగ్బీ ఆటకు ఆదరణ పెరుగుతోందని, రానున్న సంవత్సరాల్లో ఈ క్రీడ మరింత ప్రజాదరణ పొందుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో జరగనున్న ఆర్‌పీఎల్ సీజన్-2 పోటీలు రగ్బీని మరింత మంది యువతకు చేరువ చేయడంతో పాటు దేశంలో క్రీడాభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply