Hyderabad Government Hospitals | రూ.300 కోట్ల బకాయిలతో నిలిచిన మందుల సరఫరా
Hyderabad Government Hospitals | రూ.300 కోట్ల బకాయిలతో నిలిచిన మందుల సరఫరా
Hyderabad Government Hospitals | రోగులపై ఆర్థిక భారం
బిల్లులు చెల్లించకుంటే మందులు సరఫరా చేయలేం
Hyderabad Government Hospitals | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మందులు అందడం లేదు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.300 కోట్ల బకాయిలు నిలిచిపోవడంతో వారు మందుల సరఫరా నిలిపివేశారు. దీంతో హైదరాబాద్‌లోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడింది.
సర్జికల్, డయాగ్నొస్టిక్ సామగ్రి సరఫరాదారులకు రూ.151 కోట్ల బిల్లులను నిలిపివేశారు. అదేవిధంగా రూ.125 కోట్ల ఎక్విప్‌మెంట్ బిల్లులు నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మరో రూ.32 కోట్లు నిలిచిపోవడంతో సరఫరాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సరఫరాదారులకు చెల్లించాల్సిన బిల్లుల కోసం ప్రతినెల మందులు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను విడుదల చేస్తోంది. ఈ నిధులు ఎటూ సరిపోకపోవడంతో నెలవారీగా ఇచ్చే బిల్లులను రూ.100 కోట్లకు పెంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆర్థిక శాఖతో చర్చించడంతో, ప్రతినెల రూ.100 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తోంది.
మందుల సరఫరాదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని టీజీఎంఎస్ఐడీసీ ఉన్నతాధికారులు రూ.100 కోట్ల నిధుల మంజూరు కోసం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపగా, ఆ ఫైలును తిరస్కరించి పాత పద్ధతిలోనే రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయడంతో సరఫరాదారులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేకపోతున్నారు.
రోగులపై ఆర్థిక భారం
రాష్ట్రంలోనే నిరుపేద ప్రజలకు ప్రాణాపాయ స్థితిలో మెరుగైన వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సరఫరా నిలిచిపోవడంతో, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తాత్కాలిక పద్ధతిలో కొటేషన్‌పై మందుల కొనుగోళ్లు చేస్తున్నారు. దీనివల్ల రూ.100 ఉన్న ఒక పరికరం 5 నుంచి 10 రెట్ల ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ భారమంతా నిరుపేద రోగులపైనే పడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా మందులు, సర్జికల్స్, ఎక్విప్‌మెంట్ల కొనుగోళ్లను టీజీఎంఎస్ఐడీసీ ద్వారానే ప్రభుత్వం చేపడుతోంది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ఆసుపత్రుల్లో ఉస్మానియాలో రూ.4.50 కోట్లు, గాంధీ ఆసుపత్రిలో రూ.7 కోట్లు, నిలోఫర్‌లో రూ.7 కోట్లు, సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో రూ.1.50 కోట్లు, ఈఎన్టీ ఆసుపత్రిలో రూ.1.50 కోట్లు, పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రిలో రూ.1.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఉస్మానియాలో రూ.18 కోట్లు, గాంధీలో రూ.9 కోట్లు, నిలోఫర్‌లో రూ.5 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించే సూపర్ స్పెషాలిటీ స్థాయి ఆసుపత్రుల్లో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో రోగుల సమస్యలు వర్ణనాతీతంగా మారాయి.
బిల్లులు చెల్లించకుంటే మందులు సరఫరా చేయలేం
మందులు, సర్జికల్, ఎక్విప్‌మెంట్, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను చెల్లించకుంటే రోగులకు అవసరమైన మందులు సరఫరా చేయలేమని జంట నగరాల ఆసుపత్రుల సప్లయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రామచంద్ర తెలిపారు. 2024 నుంచి నిలిచిపోయిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మందుల సరఫరాను నిలిపివేశామన్నారు.
సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ఉస్మానియా, గాంధీ తదితర ఆసుపత్రులకు మందుల సరఫరా నిలిపివేయడంతో ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తాత్కాలిక పద్ధతిలో కొటేషన్‌లపై అధిక ధరలకు మందులు కొనుగోలు చేయాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రస్తుతం నెలవారీగా ఇచ్చే రూ.50 కోట్ల బడ్జెట్‌ను రూ.100 కోట్లకు పెంచి, సరఫరాదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
