LPG Price India | ఎల్పీజీ ధరల పెంపును సమర్థించుకున్న ప్రభుత్వం
LPG Price India | ఎల్పీజీ ధరల పెంపును సమర్థించుకున్న ప్రభుత్వం
LPG Price India | ఉజ్వల లబ్ధిదారులకు సబ్సిడీలో మార్పు లేదు
ఎల్పీజీ వాస్తవ ధర రూ.1,600
LPG Price India | న్యూఢిల్లీ: ఎల్పీజీ ధరల పెంపును ప్రభుత్వం సమర్థించుకుంది. పొరుగు దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలైన ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాతో పోలిస్తే భారత్‌లోనే గ్యాస్ ధరలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ధరల పెంపును సమర్థించుకున్న ప్రభుత్వం.. ఒక్కో సిలిండర్‌పై ఇంకా రూ.700 నష్టం వస్తోందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద గ్యాస్ పొందిన వినియోగదారులు 14.2 కేజీల సిలిండర్‌కు రూ.642 చెల్లిస్తున్నారని, ఢిల్లీలో జనరల్ వినియోగదారులు సిలిండర్‌కు రూ.942 చెల్లిస్తున్నారని, వాస్తవంగా సిలిండర్ ధర రూ.1,600గా ఉందని తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని 14.2 కేజీల సిలిండర్‌పై ప్రభుత్వం రూ.29 పెంచిందని పేర్కొంది. పెంచిన గ్యాస్ ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలతో ముడిపడి ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉజ్వల యోజన కింద ప్రతి లబ్ధిదారుకు సంవత్సరానికి నాలుగు సిలిండర్లకు రూ.300 అదనంగా ప్రభుత్వం నేరుగా బదిలీ చేయనుంది. ఉజ్వల కుటుంబం సగటు వినియోగం నాలుగు సిలిండర్లు కాబట్టి ఒక్కో సిలిండర్‌పై రూ.642 చెల్లిస్తారు. ఈ లబ్ధిదారులకు చెల్లిస్తున్న సబ్సిడీలో ఎలాంటి మార్పు లేదు. పీఎంయూవై పథకంలో లేనివారు కూడా మార్కెట్ ధర కంటే రూ.700 తక్కువగానే చెల్లిస్తున్నారని ఈ ప్రకటనలో వివరించింది.
ఒక్కో సిలిండర్‌పై అవుతున్న ఖర్చును పూర్తిగా వినియోగదారులపై మోపడం లేదని పేర్కొంది. అంతర్జాతీయంగా చూస్తే పాకిస్థాన్‌లో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1,046, నేపాల్‌లో రూ.1,207, బంగ్లాదేశ్‌లో రూ.1,225, శ్రీలంకలో రూ.1,411, అమెరికాలో రూ.1,755, ఆస్ట్రేలియాలో రూ.1,765, కెనడాలో రూ.2,411గా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల సవరిస్తున్నట్లు తెలిపింది. గృహ వినియోగ సిలిండర్‌పై ఇలా పెంచడం లేదని పేర్కొంది. హార్మూజ్ జలసంధి మూసివేతతో గ్యాస్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ కాంట్రాక్ట్ ధర టన్నుకు 775 డాలర్లకు పెరిగింది. తరువాత జూన్‌లో ఇది టన్నుకు 790 డాలర్లకు పెరిగింది.
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభానికి ముందు ఫిబ్రవరిలో ఎల్పీజీ బెంచ్ మార్క్ ధర సుమారు 46 శాతం పెరిగింది. గ్యాస్తోపాటే చమురు ధర కూడా పెరిగిందని ఈ ప్రకటనలో పేర్కొంది.
ఎల్పీజీ వాస్తవ ధర రూ.1,600
జూన్ కాంట్రాక్ట్ ప్రకారం 14.2 కేజీల సిలిండర్ సరఫరా ఖర్చు రూ.1,600 దాటిందని తెలిపింది. దీంతో ప్రస్తుతం ప్రతి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై కంపెనీలు రూ.700 నష్టాన్ని భరిస్తున్నాయని తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం తరువాత వాణిజ్య సిలిండర్ ధరను ఐదు సార్లు పెంచారు. దీని తరువాత 19 కేజీల సిలిండర్ ధర రూ.3,113.50కు చేరింది.
వాణిజ్య సిలిండర్ గ్యాస్ కిలోకు సగటున రూ.164 పడుతుందని, అదే గృహ వినియోగ సిలిండర్‌లో కేజీ గ్యాస్‌కు వినియోగదారులు రూ.66 చెల్లిస్తున్నారని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై మార్చి 7న కంపెనీలు రూ.60 పెంచాయి. తాజాగా మరో రూ.29 పెంచినప్పటికీ ఇంకా ఒక్కో సిలిండర్‌పై రూ.700 కంపెనీలు నష్టపోతున్నాయని తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం తరువాత గ్యాస్ సరఫరాల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడడంతో దేశీయంగా ఉత్పత్తిని 32 వేల టన్నుల నుంచి 52 వేల టన్నులకు పెంచినట్లు తెలిపింది.
