ఎన్‌టీఆర్ ఆశయాలతో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం..

ఎన్‌టీఆర్ ఆశయాలతో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దాం..

విజయవాడ, ఆంధ్రప్రభ: తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కీర్తిప్రతిష్టలు అజరామరమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు.

ఎన్‌టీఆర్ జయంతి సందర్భంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతి, సమాజ సేవకు ఎన్‌టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలుగు జాతి గర్వపడే విధంగా ఆయన అమలు చేసిన విప్లవాత్మక పరిపాలనా సంస్కరణలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మహోన్నత వ్యక్తి ఎన్‌టీఆర్ అని కొనియాడారు.

ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమష్టిగా పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని, అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధాని, ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర – వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.

Leave a Reply