Bhu Bharati Portal | శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా పనిచేసే రోవర్ మిషన్

Bhu Bharati Portal | శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా పనిచేసే రోవర్ మిషన్

Bhu Bharati Portal | మూడు రోజుల్లో వెయ్యి ఎకరాలు..?
అధికారుల జాయింట్ సిగ్నేచర్
..

Bhu Bharati Portal | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: భూభారతి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వం.. వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన కొలతలు, పారదర్శకత కోసం నూతన సాంకేతికతను రంగంలోకి దించుతోంది. ఇందులో భాగంగానే మరో 400 అత్యాధునిక రోవర్ యంత్రాలను కొనుగోలు చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 15 లోపే ఈ ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయని తెలిసింది. ఇప్పటికే సుమారు 400కుపైగా రోవర్ యంత్రాలు ఉన్నప్పటికీ, మరింత వేగంగా, ఖచ్చితత్వంతో సర్వేలు నిర్వహించేందుకు అదనంగా 50 శాతం మిషన్లను కొనుగోలు చేయనున్నారు.

శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా పనిచేసే రోవర్ మిషన్…

శాటిలైట్ అనుసంధానంతో పనిచేసే వీటి ద్వారా సరిహద్దులను వేగంగా గుర్తించి నమోదు చేయవచ్చనే అభిప్రాయంలో సర్కార్ ఉంది. పాతకాలం సర్వేలకు స్వస్తి చెప్పి, టెక్నాలజీతో కూడిన ఈ రోవర్ మిషన్లను సర్వే కోసం వినియోగించనున్నారు. వాస్తవానికి రోవర్ అనేది శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా పనిచేసే ఒక అధునాతన ఎలక్ట్రానిక్ పరికరం. గతంలో గొలుసులతో కొలిచినప్పుడు అడుగుల తేడా వచ్చే అవకాశం ఉండేది. కానీ రోవర్ ద్వారా కేవలం 2 నుంచి 5 సెంటీమీటర్ల వ్యత్యాసం కూడా లేకుండా కచ్చితమైన రీడింగ్ వస్తుందని అధికారులు చెబుతున్నారు.

మూడు రోజుల్లో వెయ్యి ఎకరాలు..?

సాధారణ విధానంలో సర్వే నిర్వహిస్తే అత్యధిక సమయం పడుతుంది. కానీ ఈ రోవర్లతో కేవలం మూడు రోజుల్లోనే వెయ్యి ఎకరాలను సులువుగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయొచ్చని రెవెన్యూ శాఖ చెబుతోంది. దీంతో ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య నలుగుతున్న భూ పంచాయితీలను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేయొచ్చని రెవెన్యూ శాఖ భావిస్తోంది.

రాష్ట్రంలో కొన్నేళ్లుగా అటవీ శాఖకు, రెవెన్యూ శాఖకు మధ్య భూ వివాదాలు కొనసాగుతున్నాయి. దీంతో పర్యావరణ పరిరక్షణకు ఆటంకం కలుగుతోందని, అటు సాగు చేసుకునే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వివాదాలను రూపుమాపేందుకు త్వరలోనే ఆరు శాఖల అధికారులతో కూడిన ఉమ్మడి బృందాలు క్షేత్రస్థాయిలోకి దిగనున్నాయి. కామన్ సర్వే పేరిట పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి సరిహద్దులను గుర్తించనున్నారు. ఈ సర్వే డీఎఫ్ఓ, రెవెన్యూ అధికారుల సమక్షంలో జరగనుంది.

అధికారుల జాయింట్ సిగ్నేచర్…

గతంలో సర్వేలు జరిగినా ఒక శాఖ రికార్డులను మరో శాఖ అంగీకరించని పరిస్థితి ఉండేది. కానీ ఈసారి నిబంధనలను కఠినతరం చేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో కూడిన రోవర్ల సర్వే పూర్తయిన వెంటనే క్షేత్రస్థాయిలోనే డిజిటల్ మ్యాపులు తయారవుతాయి. ఈ రికార్డులపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖల అధికారుల ఉమ్మడి సంతకాలను తప్పనిసరి చేశారు.

ఇరు శాఖల ఆమోద ముద్ర పడిన తర్వాతే ఆ రికార్డులను ఫైనల్ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ వివాదాలు తలెత్తే అవకాశమే ఉండదు. అంతేగాక ఈ సర్వే ద్వారా సేకరించే ప్రతి ఇంచ్ భూమి సమాచారం అత్యంత భద్రంగా ఉంచుతారు. క్లౌడ్ టెక్నాలజీ సహాయంతో ఈ డేటాను ఇటు రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లతో పాటు అటు కేంద్ర ప్రభుత్వ సర్వర్లలోనూ సమాంతరంగా స్టోరేజ్ చేస్తారు. దీనివల్ల రికార్డుల ట్యాంపరింగ్, డేటా మిస్సింగ్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

Leave a Reply