Telangana Employees | ట్రెజరీ అధికారుల అక్రమాలకు కళ్లెం

Telangana Employees | ట్రెజరీ అధికారుల అక్రమాలకు కళ్లెం

Telangana Employees | అడిగినంత అందిస్తున్న ఉద్యోగులు..
త్వరలోనే ఆన్‌లైన్‌లోకి..

Telangana Employees | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల హాజరుకు ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్), బకాయిల విడుదల వంటి కీలక నిర్ణయాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగుల సర్వీస్ బుక్ నిర్వహణలో ఇబ్బందులకు చెక్ పెట్టనున్నది. సర్వీస్ బుక్ వ్యవహారాల్లో జరుగుతున్న అక్రమాల కట్టడికి డిజిటల్ సర్వీస్ బుక్‌ను అమల్లోకి తెచ్చేందుకు కసరత్తును వేగవంతం చేసింది.

ఇది అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని రోజులు సెలవులు తీసుకున్నారు? ఎవరు ఎన్ని ఆర్జిత సెలవులు, శిశు సంరక్షణ సెలవులు (చైల్డ్ కేర్ లీవ్స్) వాడారన్నది తెలుసుకోవడం సులభమవుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి తీసుకున్న కారు రుణ వాయిదాలను చెల్లిస్తున్నారా? లేదా? హెచ్ఎస్ఏ ఎంత తీసుకుంటున్నారన్న అంశాల్లో పారదర్శకత వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకపై ఉద్యోగుల స్వల్పకాలిక, దీర్ఘకాలిక సెలవులన్నింటికీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది.

ట్రెజరీ అధికారుల అక్రమాలకు కళ్లెం…

ప్రస్తుతం ఉద్యోగుల సర్వీస్ పుస్తకాలను ఫిజికల్‌గా నిర్వహిస్తున్నారు. ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు అతని సెలవులు, ప్రోత్సాహకాలు (ఇంక్రిమెంట్స్), ప్రత్యేక ప్రోత్సాహకాలు (స్పెషల్ ఇంక్రిమెంట్స్), ఆర్జిత సెలవులు, ఇతర అంశాలను సంబంధిత బుక్‌లో నమోదు చేస్తున్నారు. ఈ బాధ్యతలు సంబంధిత శాఖ విభాగాధికారి, డ్రాయింగ్ ఆఫీసర్‌ (ట్రెజరీ ఆఫీసర్) పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి.

దీంతో ఆ ఇద్దరూ కుమ్మక్కై ఉద్యోగి నుంచి మామూళ్లు తీసుకుని, అతనికి అనుకూలంగా సర్వీస్ బుక్‌ను రాస్తున్నట్టు ఫిర్యాదులు తరచుగా వినిపిస్తున్నాయి. తద్వారా ఒక్కో నెల ట్రెజరీ ఆఫీసర్ లక్షల్లో వసూళ్లు చేస్తున్నట్టు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్టు తెలిసింది. అన్ని శాఖల్లో ఇదే తరహాలో దందాలు జరుగుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం ఆన్‌లైన్ సర్వీస్ బుక్‌ను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది.

అడిగినంత అందిస్తున్న ఉద్యోగులు…

సర్వీస్ బుక్‌లను తమకు అనుకూలంగా రాసేందుకు తమ పై అధికారులు, ట్రెజరీ అధికారులు ఉత్సాహం చూపుతుండటంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పుతున్నారు. దీంతో ఆర్జిత సెలవులు వాడినా వాడలేదని సర్వీస్ బుక్‌లో తప్పుగా నమోదు చేయిస్తున్నారు. దీంతో సదరు ఉద్యోగులు ఉద్యోగ విరమణ సమయంలో ఆ సెలవులను సొమ్ము చేసుకోవచ్చు.

కొన్ని జిల్లాల్లో ట్రెజరీ ఆఫీసర్ల సహకారంతో ఒక ఉద్యోగి రెండు మూడు సార్లు శిశు సంరక్షణ సెలవులు ఉపయోగించుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. మరికొన్ని జిల్లాల్లో ఉద్యోగులు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు పెట్టిన దీర్ఘకాలిక సెలవులను సైతం సర్వీస్ బుక్‌ల్లో ఎంటర్ చేయలేదని ఫిర్యాదులు అందినట్లు సమాచారం. కొందరు సీనియర్ అధికారులు కార్లు కొనుక్కునేందుకు ప్రభుత్వం నుంచి తీసుకున్న వాహన రుణాలను ట్రెజరీ ఆఫీసర్ల సహకారంతో చెల్లించకుండానే ఉద్యోగ విరమణ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.

త్వరలోనే ఆన్‌లైన్‌లోకి..

ట్రెజరీ అధికారుల అక్రమాలను అరికట్టేందుకు రెండు మూడు నెలల్లో ఆన్‌లైన్ సర్వీస్ బుక్‌ను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు 85 శాతం మంది ఉద్యోగులు తమ సర్వీస్ బుక్‌లను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిసింది. వాటన్నింటినీ పరిశీలించిన తరువాత ఒక్కో ఉద్యోగికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను జారీ చేయనున్నారు. ఇందుకోసం ఆర్థికశాఖ ప్రత్యేకంగా ఓ ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసింది.

ఆన్‌లైన్ సర్వీస్ బుక్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగి సెలవుల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. సెలవుల మంజూరు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఆయా ఉద్యోగికి సంబంధించిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లతోపాటు ఇతర అంశాలన్నీ ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి రానున్నాయి.

Leave a Reply