Telangana Electricity Employees | ఆర్థిక ఇబ్బందుల్లో విద్యుత్ సంస్థలు
Telangana Electricity Employees | ఆర్థిక ఇబ్బందుల్లో విద్యుత్ సంస్థలు
Telangana Electricity Employees | ఒకే తేదీన వేతనాల కోసం జేఏసీల డిమాండ్
రైతు డిస్కం రగడ మధ్య కొత్త తలనొప్పి
Telangana Electricity Employees | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న రైతు డిస్కం బహిరంగ విచారణ రగడ ఇంకా చల్లారకముందే, విద్యుత్ సంస్థల్లో అన్ని కేటగిరీలకు ఒకేసారి వేతనాలు చెల్లించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇంధనశాఖలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో నిరంతరం ఏదో ఒక సమస్య వార్తల్లోకెక్కుతూ యాజమాన్యానికి తలనొప్పిగా మారుతున్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లు దాదాపు రూ.60 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచే రూ.30 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. కొద్దికాలంగా విద్యుత్ సంస్థల్లో పనిచేసే దాదాపు 70 వేలకు పైగా ఉన్న ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది, ఆర్టిజన్లు, పెన్షనర్లకు కేటగిరీల వారీగా వేతనాలు జమ చేస్తుండటం విశేషం.
దీంతో ఒకే సంస్థలో, ఒకే కార్యాలయంలో పనిచేసే వారు “మీకు జీతం వచ్చిందా?” అని చర్చించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీలు విద్యుత్ సంస్థల్లో పనిచేసే అన్ని కేటగిరీల ఉద్యోగులందరికీ, పెన్షనర్ల సహా, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని విద్యుత్ సంస్థల సీఎండీలకు వినతిపత్రాలు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది.
మే నెలలో చెల్లించాల్సిన వేతనాలు 19 వేల మంది ఆర్టిజన్లకు ఈ నెల 3న చెల్లించగా, సుమారు 8 వేలకు పైగా ఉన్న పెన్షనర్లకు ఇంకా పెన్షన్ అందలేదని జేఏసీ నేతలు వాపోతున్నారు. ఈ విషయంపై యాజమాన్యాలు తక్షణమే స్పందించి, సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల రైతు డిస్కం ఏర్పాటుపై నిర్వహించిన ఈఆర్సీలో రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, సామాజికవేత్తల నుంచి వచ్చిన తీవ్రమైన అభ్యంతరాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి మధ్యంతరంగా తీసుకున్న ఉద్యోగుల బదిలీల వ్యవహారం ప్రభుత్వాన్ని, విద్యుత్ సంస్థలను ఉద్యోగులు హెచ్చరించే దాకా వెళ్లింది. తర్వాత ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలంటూ చేపట్టిన సమ్మె తీవ్ర పరిణామాలకు దారి తీసింది.
ఈ సమస్యలు ఇంకా ఓ కొలిక్కి రాకముందే.. తాజాగా రైతు డిస్కం అంశం ముందుకొచ్చింది. ఈ సమస్య చల్లారకముందే అన్ని కేటగిరీల వారికి ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని విద్యుత్ ఇంజనీర్స్ జేఏసీ, పవర్ జేఏసీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ విద్యుత్ సంస్థల ఆర్థిక డొల్లతనాన్ని ప్రజలకు చాటినట్టైంది.
