మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత

మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత
రాష్ట్ర కార్మిక ఉపాధి మంత్రి వివేక్..
చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత అందిస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో గల మైనారిటీ ఫంక్షన్ హాల్ లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రైన్యూర్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, అలీప్ సంస్థ సంయుక్త కార్యదర్శి కవిత రాజేష్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, రాంప్ ప్రాజెక్టు అధికారి మహమ్మద్ ఖాసీం, చెన్నూర్ మండల తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్ పర్సన్ వినీత్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో చెన్నూర్ కు 400 కుట్టు మిషన్లను కేటాయించి మహిళలకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను వివిధ వ్యాపార రంగాలలో రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ క్రమంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి పొందాలని, కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థుల ఏకరూప దుస్తులను తయారు చేసేందుకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.
