24వ డివిజన్‌లో కాంగ్రెస్ గెలుపు దిశగా దూకుడు…
గుమ్ముడాల రాధ గోవర్ధన్ గౌడ్ విజయం దాదాపు ఖాయం
34 ఏళ్ల జర్నలిస్టు అనుభవమే బలం
గోవర్ధన్ గౌడ్ సేవలపై ప్రజల విశ్వాసం
మహబూబ్ నగర్, ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుమ్ముడాల రాధ గోవర్ధన్ గౌడ్ గెలుపు దాదాపు ఖాయమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. డివిజన్‌లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం నెలకొనడంతో పాటు అభ్యర్థి పట్ల ప్రజల్లో విశ్వాసం బలపడటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.
అభ్యర్థి భర్త గోవర్ధన్ గౌడ్ గత 34 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తూ డివిజన్ పరిధిలోని సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన,రాజకీయ, అధికార యంత్రాంగంతో ఉన్న పరిచయాలు, సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన అనుభవమే కాంగ్రెస్ అభ్యర్థికి ప్రధాన బలంగా మారిందని స్థానికులు అంటున్నారు.
విగ్నేశ్వర కాలనీ, రబియా మజీద్, శ్రీరామ కాలనీ, ఎస్.ఆర్.నగర్, మధురానగర్, నాగేంద్ర కాలనీల ప్రజలు తమ సమస్యలు కొత్త కాకుండా సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటి పరిష్కారానికి అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గెలుపు కట్టబెడితే రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, సంక్షేమ పథకాల అమలులో వేగం పెరుగుతుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.మొత్తంగా 24వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుమ్ముడాల రాధ గోవర్ధన్ గౌడ్‌కు అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆమె విజయం దిశగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
