వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలి

  • హేమంత్ రెడ్డి

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఆ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని కోరారు.

విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,600 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల హామీల్లో పేర్కొన్న నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసి, ఇప్పటికే గడిచిన 25 నెలలకు గాను ప్రతి నిరుద్యోగికి రూ.75 వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మూడు ప్రధాన డిమాండ్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమైందని హేమంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు, ఆగస్టు 10న భారీ ర్యాలీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. యువత, విద్యార్థులు, ప్రజా సంఘాలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.