గురుకులాల అభివృద్ధే లక్ష్యం
ఆర్‌సీఓగా బీఏఎల్ నారాయణ నాయక్
మహబూబాబాద్, ఆగస్టు 5 (ఆంధ్రప్రభ): మహబూబాబాద్ గిరిజన గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ (ఆర్‌సీఓ)గా బీఏఎల్ నారాయణ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఇప్పటివరకు ఆర్‌సీఓగా విధులు నిర్వహించిన రత్నకుమారి నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణ నాయక్, సీనియర్ ప్రిన్సిపాల్‌గా గురుకుల సొసైటీలో అందించిన సేవలను గుర్తించిన గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి ఆయనను మహబూబాబాద్ రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమించారు.
ఈ సందర్భంగా నారాయణ నాయక్ మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలలు సమర్థవంతంగా నిర్వహించబడేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. గతంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ (డీసీఓ)గా పనిచేసిన అనుభవంతో గురుకులాల పరిపాలన, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. అధికారుల సహకారంతో జిల్లాలోని గురుకులాలను అన్ని రంగాల్లో రాష్ట్రంలో ముందువరుసలో నిలిపేందుకు కృషి చేస్తానని అన్నారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన నారాయణ నాయక్‌ను దామరంచ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ నాయక్‌తో పాటు వివిధ గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
