కలెక్టర్ చాంబర్ ముట్టడి..

కలెక్టర్ చాంబర్ ముట్టడి..

విద్యాశాఖ వైఫల్యంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

అక్రమ పాఠశాలలను వెంటనే మూసివేయాలని డిమాండ్

నిజామాబాద్, ఆంధ్రప్రభ: జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐపీఎస్‌యూ, డీఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల జిల్లా కమిటీలు సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌ను ముట్టడించాయి.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, గత రెండు నెలలుగా అనుమతి లేని పాఠశాలల వివరాలను విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన విద్యాశాఖ అధికారులే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో అనేక పాఠశాలలు అనుమతులు లేకుండానే “ప్రవేశాలు పూర్తయ్యాయి” అంటూ బోర్డులు ఏర్పాటు చేసి విద్యార్థులను ఆకర్షిస్తున్నప్పటికీ, వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

జిల్లా విద్యాశాఖ అధికారికి వాస్తవ పరిస్థితులను తెలియజేయకుండా కొందరు మండల విద్యాశాఖ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. అనుమతి లేని పాఠశాలలను వెంటనే మూసివేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి, సంబంధిత మండల విద్యాశాఖ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

కలెక్టర్ చాంబర్ ముట్టడి సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకుని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి రఘురాం, ఏఐపీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బొడ్డు అనిల్‌, డీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జీవన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సుబోధ్‌, ఏఐపీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి గోపాల్ సింగ్ ఠాగూర్‌, నాయకులు కుశాల్‌, రాజు, చక్రి, సునీల్‌, శివ, వినీత్‌, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply