ఓటరు జాబితాలో అర్హులెవ్వరూ మినహాయించొద్దు..
కలెక్టర్ డా. ఏ. సిరి స్పష్టమైన ఆదేశాలు
కర్నూలు, ఆంధ్రప్రభ : ఓటరు జాబితా నుంచి అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా మినహాయించబడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ప్రతి బీఎల్‌ఓ తమ పరిధిలో రోజుకు కనీసం 10 శాతం మేర ఓటర్ల వివరాల డిజిటైజేషన్ పురోగతి నమోదు చేయాలని సూచించారు.
గురువారం కర్నూలు నగరంలోని జమ్మిచెట్టు వద్ద గడ్డవీధిలోని 244, 245 పోలింగ్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న డిజిటైజేషన్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) సేకరించిన సమాచారాన్ని యాప్‌లో డిజిటైజేషన్ చేస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా డిజిటైజేషన్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. అర్హులైన ఓటర్లందరి వివరాలు తప్పకుండా నమోదు చేయాలని, ఎవరూ జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓటర్లు అందుబాటులో ఉండే సమయాల్లో ఇంటింటికీ వెళ్లి అవసరమైన ఫొటోలు, పత్రాలు, ఇతర వివరాలను సేకరించి నిర్ణీత లక్ష్యాన్ని పూర్తి చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు. నిర్దేశించిన గడువులోగా 100 శాతం డిజిటైజేషన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బీఎల్‌ఓలు డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) వారితో సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా బీఎల్‌ఓ యాప్‌లో ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటైజేషన్ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు.
