34 వేల మంది విద్యార్థుల నమోదే లక్ష్యం..

  • నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాల పై చర్యలు
  • జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచి, 34 వేల మంది విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జీరో నమోదు, 15 లేదా అంతకంటే తక్కువ విద్యార్థుల నమోదు ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత పాఠశాలలు వెంటనే డ్రాప్‌బాక్స్‌లో స్వీకరించి సకాలంలో క్లియర్ చేయాలన్నారు.

డ్రాప్‌బాక్స్‌లో ఎలాంటి పెండింగ్‌లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనలు పాటించని, సహకరించని ప్రైవేట్ పాఠశాలలకు వివరణ కోరుతూ చర్యలు ప్రారంభించాలన్నారు. ఉపాధ్యాయులందరూ ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు లేదా ఆన్ డ్యూటీ నమోదును తప్పనిసరిగా చేయాలని, సెలవులో ఉన్న ఉపాధ్యాయుల దరఖాస్తులను సంబంధిత అధికారులు తక్షణమే ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో తలెత్తే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి, హాజరు నమోదులో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారి మల్లేష్ గౌడ్ ,మండల విద్యాధికారులు, సంబంధిత ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.