ఏసీబీ సోదాలు…

రూ.4 కోట్లకుపైగా అక్రమాస్తుల గుర్తింపు

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ అధికారిపై కేసు..

మూడు నగరాల్లో ఏకకాల సోదాలు

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కర్నూలులో నిర్వహించిన మెరుపు సోదాలు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ అధికారి యుగంధర్ మునిప్రసాద్‌కు చెందిన ఆస్తులపై శుక్రవారం ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కర్నూలులోని చాణిక్యపురి కాలనీలో ఉన్న నివాసంతో పాటు కర్నూలు, తిరుపతి, హైదరాబాద్ నగరాల్లో ఉన్న ఆయన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి.

ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో జరిగిన సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. సోదాల సందర్భంగా భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంకు లాకర్‌ను కూడా గుర్తించినట్లు తెలిపారు. లాకర్‌లో ఉన్న ఆస్తుల విలువను అంచనా వేసిన తర్వాత అక్రమాస్తుల మొత్తం విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఆదాయానికి మించిన ఆస్తులపై దర్యాప్తు

జోనల్ అధికారిపై చట్టబద్ధ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల ఆధారంగా నమోదైన కేసు మేరకు ఏసీబీ సోదాలు చేపట్టింది. సోదాల్లో లభించిన స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, విలువైన ఆభరణాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అక్రమాస్తుల కొనుగోలు, పెట్టుబడుల మూలాలపై కూడా లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.

తుది లెక్కల తర్వాతే పూర్తి వివరాలు

ప్రస్తుతం లభించిన వివరాలు ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, స్వాధీనం చేసుకున్న పత్రాల పరిశీలన, బ్యాంకు లాకర్ తనిఖీ, మార్కెట్ విలువల నిర్ధారణ అనంతరం అక్రమాస్తుల అసలు విలువపై స్పష్టత వస్తుందని ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాలు పూర్తైన తర్వాత పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందన్నారు.

అవినీతిపై ఉక్కుపాదం

రాష్ట్రంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులపై ప్రభుత్వం, ఏసీబీ ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ఏసీబీ తుది నివేదిక అనంతరం అక్రమాస్తుల విలువ, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.