అక్రమంగా పశువుల తరలింపు.. వాహనం సీజ్

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఒక వాహనాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… చౌటుప్పల్ హెడ్ కానిస్టేబుల్ కె. రాంబాబు, ఏఆర్‌పీసీ-7967 సిబ్బంది పీఎం-1 విధులు నిర్వహిస్తుండగా అక్రమంగా పశువుల రవాణా జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందింది.

​దీంతో అప్రమత్తమైన పోలీసులు చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి క్రాస్ రోడ్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన మహీంద్రా బొలెరో వాహనాన్ని (టీఎస్ 29టీ 0342) ఆపి తనిఖీ చేయగా అందులో ఎలాంటి అనుమతులు లేకుండా క్రూరంగా తరలిస్తున్న 11 పశువులను (4 ఆవులు, 7 ఎద్దులు) గుర్తించారు.

​వాహనాన్ని నడుపుతున్న కోదాడ మతానగర్‌కు చెందిన ఎస్‌కే అమీర్ (24)ను అదుపులోకి తీసుకుని విచారించగా వాహన యజమాని ఎస్‌కే అక్రం సూచనల మేరకు కోదాడ సంతలో వీటిని కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు తరలిస్తున్నట్లు అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.