మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

  • సీఐ సత్యనారాయణ గౌడ్

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని, టీజీ-నాబ్, ఈగల్ ఫోర్స్ వంటి ప్రత్యేక విభాగాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు.

మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలు మరియు సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మత్తు పదార్థాల సరఫరా, విక్రయాల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్‌తో పాటు ఇతర కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుందని, సమాజాన్ని ఆరోగ్యవంతంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.