ఎస్‌ఐఆర్ ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి..
మరిపెడ, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిపెడ తహసీల్దార్ కొండపల్లి కృష్ణవేణి సూచించారు.
శుక్రవారం మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను ఆమె తనిఖీ చేశారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి చేపడుతున్న ఓటర్ల సర్వే విధానాన్ని పరిశీలించి, వారికి పలు సూచనలు, సలహాలు అందించారు.
ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని బీఎల్‌ఓలకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి వివరాలను సక్రమంగా నమోదు చేసి, ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా బీఎల్‌ఓలకు అవసరమైన సమాచారం అందించి ఓటరు నమోదు ప్రక్రియ విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ బెస్త సంపూర్ణ, గ్రామ ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.
