చిరిగిన బ్యాగులో చెదరని విలువలు

చిరిగిన బ్యాగులో చెదరని విలువలు

  • నగదు, పాస్పోర్ట్ చూసినా మారని మనసు
  • పట్టాలపై కనిపించిన నిజాయితీ కథ
  • నేపాలీ ప్రయాణికుడికి ఊరటనిచ్చిన కీమెన్

మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : రైల్వే ట్రాక్పై విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి నిజాయితీ మహబూబాబాద్లో హృదయాలను హత్తుకుంది. శనివారం మహబూబాబాద్-తాళ్లపూసపల్లి మధ్య 433 కిలోమీటర్ బార్ 3-5 పోస్ట్ వద్ద కీమెన్ పాశం వంశీకి ఓ బ్యాగ్ కనిపించింది. రైలు నుంచి పడటంతో అది చిరిగిపోయి ఉండగా అందులో నగదు, ఐఫోన్, పాస్పోర్ట్ ఉన్నట్లు గుర్తించాడు. విలువైన వస్తువులు చూసిన తర్వాత కూడా వాటిపై ఆశపడకుండా బాధ్యతగా వ్యవహరించాడు. వెంటనే మహబూబాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆర్పీఎఫ్ ఎస్ఐ సుభానికి బ్యాగ్ అప్పగించాడు.

మరోవైపు బ్యాగ్ పోగొట్టుకున్న నేపాల్కు చెందిన ప్రయాణికుడు వరంగల్లో ఫిర్యాదు చేశాడు. రైల్వే అధికారులు వివిధ స్టేషన్లలో ఆరా తీయగా బ్యాగ్ మహబూబాబాద్లో లభించినట్లు సమాచారం అందింది. దీంతో బాధితుడు వెంటనే మహబూబాబాద్ చేరుకున్నాడు. తాను తమిళనాడు ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న సమయంలో బ్యాగ్ జారిపడిందని వివరించాడు.

ఎస్ఐ సుభాని సూచనతో బ్యాగ్ను తెరిచి వస్తువులను తనిఖీ చేశాడు. అందులోని నగదు, ఐఫోన్, పాస్పోర్ట్ సహా అన్ని వస్తువులు యథాతథంగా ఉండటంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమూల్యమైన పత్రాలు తిరిగి దక్కడంతో బాధితుడు భావోద్వేగానికి గురయ్యాడు. వంశీ చేతులు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపాడు. నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన వంశీని ఎస్ఐ సుభాని, రైల్వే సిబ్బంది అభినందించారు. చిన్న చర్యతో పెద్ద నమ్మకాన్ని నిలబెట్టిన ఘటనగా ఇది నిలిచిపోయింది.

Leave a Reply