Kondagattu అంజన్న నాకు పునర్జన్మనిచ్చాడు…

Kondagattu అంజన్న నాకు పునర్జన్మనిచ్చాడు…

  • మాట నిల‌బెట్టుకున్న ప‌వ‌న్..
  • టీటీడీ నిధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఇష్టదైవమైన తెలంగాణలోని కొండగట్టు అంజన్న క్షేత్రంపై తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నారు. గతంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి రూ.35.19 కోట్ల నిధులను మంజూరు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రెండు రోజుల క్రితమే టీటీడీ బోర్డు ఈ నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.

కాగా, అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పనుల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.

గత ఏడాది వారాహి యాత్ర సమయంలోనూ, ఇటీవల ఎన్నికల తర్వాత వారాహి దీక్షలో భాగంగా ఆలయాన్ని సందర్శించినప్పుడు, భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పించాలని అర్చకులు కోరగా పవన్ ఈ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడులతో చర్చించి ఈ నిధులను విడుదల చేయించారు.

అభివృద్ధి పనులు, వసతులు

ఈ భారీ నిధులతో కొండగట్టులో భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. దాదాపు 96 గదులతో కూడిన భారీ సత్రాన్ని నిర్మించనున్నారు. ఏటా హనుమాన్ జయంతికి వచ్చే వేలాది మంది మాలధారుల కోసం ప్రత్యేకంగా 2 వేల మంది భక్తులకు స‌రిప‌డ‌ దీక్షా విరమణ మండపాన్ని నిర్మించనున్నారు.

కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చింది..

ఈ నిధుల కేటాయింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. గతంలో ఒక సభలో తనపై హైటెన్షన్ విద్యుత్ తీగ పడినప్పుడు, తన పక్కన ఉన్న వారు షాక్‌కు గురైనా, అంజన్న దయ వల్ల తనకు కేవలం జుట్టు మాత్రమే కాలడం ఒక అద్భుతమని ఆయన పేర్కొన్నారు.

ఆ రోజు స్వామివారే తనను కాపాడారని, అందుకే కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందని బలంగా నమ్ముతా అని అన్నారు ప‌వ‌న్ క‌ళ్యాన్. 2009లో ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి, జనసేన పార్టీ స్థాపన, వారాహి రథానికి పూజ నిర్వహణ వరకు, ఆయన ప్రతి రాజకీయ అడుగు కొండగట్టు ఆశీర్వాదంతో ప్రారంభమైందని పేర్కొన్నారు.

త్వ‌ర‌లో నారసింహ యాత్ర..

సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ త్వరలో ‘అనుష్టుప్ నారసింహ యాత్ర’ చేపట్టబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 31 నారసింహ క్షేత్రాలను ఆయన దర్శించుకోనున్నారు. విశేషమేమిటంటే, ఈ యాత్ర కూడా కొండగట్టు అంజన్న క్షేత్రం నుంచే ప్రారంభం కానుంది. తెలంగాణలోని ఒక ఆధ్యాత్మిక క్షేత్ర అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం, టీటీడీ ద్వారా నిధులు ఇప్పించి, పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల భక్తుల మనసు గెలుచుకున్నారు.