Kinjarapu Atchannaidu | ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు పెంపు

  • ఆగస్టు 15 వరకు పొడిగింపు
  • రైతులకు మరో 15 రోజుల అవకాశం
  • వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం
  • రుణగ్రహీత, రుణేతర రైతులు నమోదు పూర్తి చేయాలని సూచన
  • వరి సహా నోటిఫై చేసిన అన్ని పంటలకు గడువు ఆగస్టు 15 వరకు
  • చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దని రైతులకు విజ్ఞప్తి
  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

వరి పంట మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకు గతంలో జూలై 31తో ముగియాల్సిన బీమా ప్రీమియం చెల్లింపు గడువును కేంద్ర ప్రభుత్వం, బీమా సంస్థలతో చర్చించి ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. వరి పంటకు ఇప్పటికే ఆగస్టు 15 వరకు గడువు అమల్లో ఉందని పేర్కొన్నారు.

ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని నష్టాల నుంచి ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా కీలకమని మంత్రి అన్నారు. రుణగ్రహీతలు, రుణేతర రైతులందరూ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే బీమా నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.

రైతులు సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ ద్వారా పంటల బీమా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. చివరి రోజుల్లో పోర్టల్‌పై రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.