సాయికృష్ణ కేసులో కీలక మలుపు

సాయికృష్ణ కేసులో కీలక మలుపు

సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు
తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో చర్యలు..
స్వయంగా ఫిర్యాదు స్వీకరించిన సీపీ రాజశేఖర్‌బాబు
హత్య, అక్రమ నిర్బంధం సహా పలు సెక్షన్లు నమోదు..
దర్యాప్తు అధికారిగా ఏసీపీ దైవ ప్రసాద్‌

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ కృష్ణలంక సీఐ నాగరాజు పై హత్య, అక్రమ నిర్బంధం ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ నగర పోలీసులు చర్యలు చేపట్టారు. నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు స్వయంగా ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ కేసు విచారణ బాధ్యతలను దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్‌కు అప్పగించారు.

లాకప్ డెత్ ఆరోపణలతో కొత్త మలుపు..
సాయికృష్ణ అదృశ్యం కేసు ప్రారంభం నుంచే పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే ఇటీవల సాయికృష్ణ కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు లాకప్‌లోనే సాయికృష్ణకు హాని జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు సీఐ నాగరాజుపై నేర కేసు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు సీఐ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు. ఇది హత్యకు సంబంధించిన నిబంధన. నేరం రుజువైతే జీవిత ఖైదు లేదా చట్టప్రకారం కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ నమోదు కావడం కేసు తీవ్రతను సూచిస్తోందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇక బీఎన్ఎస్ సెక్షన్ 127(4) ప్రకారం ఒక వ్యక్తిని పదిరోజులకు మించి అక్రమంగా నిర్బంధిస్తే ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సాయికృష్ణను అధికారిక రికార్డుల్లో చూపకుండా నిర్బంధించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సెక్షన్‌ను చేర్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సెక్షన్ 127(6) కింద కూడా కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తిని ఎక్కడ నిర్బంధించారన్న విషయాన్ని కుటుంబ సభ్యులు, ప్రజలు లేదా ప్రభుత్వ అధికారులకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెడితే ఈ నిబంధన అమలులోకి వస్తుంది. ఈ నేరానికి మూడేళ్ల వరకు అదనపు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.

ఏసీపీ దైవ ప్రసాద్‌కు దర్యాప్తు బాధ్యతలు..
కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని విచారణ బాధ్యతలను దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్‌కు అప్పగించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలు, పోలీసు రికార్డులు, సంబంధిత అధికారుల వాంగ్మూలాలను సేకరించి సమగ్ర దర్యాప్తు నిర్వహించే అవకాశం ఉంది. సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు కావడం మరింత సంచలనం సృష్టించింది. విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు ఈ కేసు భవిష్యత్ దిశను నిర్ణయించనున్నాయి. బాధిత కుటుంబం మాత్రం సాయికృష్ణకు ఏమి జరిగిందో పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.