బెజవాడకు మహా ఘనత
అడుగుడగునా.. ఉల్లాసం.. ఉత్సాహం
40 కళాబృందాలు,
3 వేల మంది కళాకారులతో మెగా వాక్..
పర్యాటక, స్థానిక కళలకు కొత్త ఊపు..
విజయవాడకు జాతీయ, అంతర్జాతీయంలో గౌరవం..

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ (Vijayawada) బందర్ రోడ్ (Bunder Road) గురువారం రాత్రి కళల సముద్రంలా మారింది. దసరా కార్నివాల్ వాక్ (Dussehra Carnival Walk) అంగరంగ వైభవంగా ప్రారంభమై నగర గౌరవాన్ని మరోసారి ప్రపంచ పటంలో నిలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి, ఈ మహోత్సవాన్ని భవిష్యత్తులో కొనసాగించేలా నాంది పలికారు.

గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం…
ఈసారి నిర్వహించిన దసరా కార్నివాల్ కేవలం పండుగ సంబరమే కాదు.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. 40కి పైగా కళాబృందాలు, 3 వేల మందికి పైగా కళాకారులతో నిర్వహించిన ఈ కార్నివాల్ వాక్‌ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ (Guinness Book of World Records)లో స్థానం సంపాదించుకుంది. తద్వారా విజయవాడ(Vijayawada)కు ప్రపంచ వేదికపై విశిష్టమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.

అమ్మవారి ఊరేగింపు.. భక్తి, వైభవానికి ప్రతీక
కార్నివాల్ ప్రధాన ఆకర్షణగా నిలిచిన అమ్మవారి అలంకార ఊరేగింపు నగరాన్ని భక్తిరసంతో నింపేసింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారు ఊరేగింపు వైభవంగా సాగింది. సంప్రదాయ వాయిద్యాలు, మంగళగీతాలు, హారతులు నగరాన్ని ఆధ్యాత్మికతతో నింపాయి.

కళాకారుల ప్రతిభ, వైభవాన్ని మరింతగా పెంచింది..
భారతీయ సాంప్రదాయం నుంచి ఆధునిక నృత్యరూపాలు వరకు, ప్రత్యేక వేషధారణలతో కూడిన కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. “ఆంధ్రసాంస్కృతిక వైభవం ఇదే” అని గర్వపడేలా వేదికను తీర్చిదిద్దారు.

బందర్ రోడ్, రంగుల మయం..
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సాగిన ప్రదర్శనతో బందర్ రోడ్ మొత్తం పండుగ వాతావరణంలో మెరిసిపోయింది. విద్యుత్ దీపాల అలంకరణలు, రంగురంగుల వేషధారణలు నగరాన్ని ప్రపంచ స్థాయి ఉత్సవ వేదికగా నిలిపాయి.

విజయవాడ ఉత్సవ్..నగర మరింత గౌరవం…
విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా నిర్వహించిన దసరా కార్నివాల్ నగరాన్ని జాతీయస్థాయిలోనే కాక ప్రపంచ వేదికపై నిలబెట్టింది. పర్యాటక రంగానికి, స్థానిక కళాకారులకు మరింత ఊపునిచ్చింది. మొత్తానికి, ఈ దసరా కార్నివాల్ వాక్ భక్తి, వైభవం, సాంస్కృతిక ప్రతిభ మాత్రమే కాకుండా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకొని విజయవాడకు గర్వకారణమైంది. ఇది విజయవాడ చరిత్రలో ప్రపంచ స్థాయి సాంస్కృతిక మైలురాయిగా నిలిచింది.

విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ రూపకర్తగా చరిత్ర పుటల్లో నిలిచిన ఎంపీ శివనాథ్
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టిన విజయవాడ ఉత్సవ్లో భాగంగా జరిగిన దసరా కార్నివాల్ వాక్ నాభూతో నా భవిష్యత్ అనిపించింది. సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక, సంప్రదాయం, ఆధునికత కలయికగా జరిగిన ఈ కార్నివాల్ ఎంపీ శివనాథ్ ముందుచూపు ఆలోచనలకు అద్దం పట్టింది. స్థానిక కళాకారులకు, పర్యాటక రంగానికి ఊపు ఇచ్చే ఈ వినూత్న ఆలోచన విమర్శకులు సైతం “శభాష్” అనిపించేలా చేసింది. ప్రజల మనసులను గెలుచుకున్న ఈ కార్నివాల్‌కు రూపకర్తగా ఎంపీ చిన్ని నిలిచారు.

Leave a Reply