ఎంఎస్ఎంఈలే ఆర్థిక బలానికి వెన్నెముక: కేశినేని చిన్ని
ఎంఎస్ఎంఈలే ఆర్థిక బలానికి వెన్నెముక: కేశినేని చిన్ని
విజయవాడ, ఆంధ్రప్రభ : “ఇంటికొక పారిశ్రామికవేత్త రావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం” అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.
విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ఎంఎస్ఎంఈలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించాలంటే ఎంఎస్ఎంఈల బలోపేతం అవసరమని అన్నారు.
చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకుడని కేశినేని చిన్ని ప్రశంసించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన పవర్ పాలసీ, ఐటీ పాలసీ, మౌలిక వసతుల అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, ఎయిర్‌పోర్ట్, జీనోమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులు ఆయన విజన్‌కు నిదర్శనమన్నారు.
కరోనా సమయంలో ప్రపంచానికి కీలకంగా నిలిచిన భారత్ బయోటెక్ వంటి సంస్థలు జీనోమ్ వ్యాలీ ద్వారా ఎదగడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు “బ్రాండ్ సీబీఎన్” కారణంగానే పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన యువతకు పెద్ద అవకాశమని అన్నారు. “ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త” అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
గత రెండు సంవత్సరాల్లో 35కు పైగా పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని, త్వరలో భారీ స్థాయిలో ఎంఓయూలు రానున్నాయని వెల్లడించారు.
15 బిలియన్ డాలర్ల ఏఐ పెట్టుబడి రాష్ట్రానికి రావడం చంద్రబాబు నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే రిలయన్స్ సంస్థ కూడా ఏఐ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ డేటా సెంటర్లు, డిఫెన్స్, స్పేస్ సిటీ వంటి భవిష్యత్ పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. ఈ అభివృద్ధితో ఎంఎస్ఎంఈలకు విస్తృత అవకాశాలు లభిస్తాయని అన్నారు.
క్లస్టర్ ప్రోగ్రామ్‌ల ద్వారా కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడకుండా ఐపీఓలు, పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకొని ఎంఎస్ఎంఈలు ఎదగాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్య సాధనలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీ కేశినేని చిన్ని కోరారు.
