దళిత సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు.. జాతీయ వేదికపై ప్రస్తావన

తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ేతర రాష్ట్రాల్లో దళితులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

సోమవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్ అధ్యక్షతన నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్‌పర్సన్ల జాతీయ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ, ఎస్సీలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు కొన్ని రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. అందువల్ల ఆయా పథకాల అమలు బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని కోరారు.

దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రధాన మూల సూత్రాలని గుర్తుచేశారు.

దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎస్సీ సెల్ నాయకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎస్సీ సెల్‌ను గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply